ప్రశ్నించే గొంతు మూగబోయింది: యార్లగడ్డ
“మండవ రమ్య మరణం పార్టీకి తీరని లోటు”
ఉంగుటూరు : వి బి న్యూస్ డిజిటల్ మీడియా
తెలుగుదేశం పార్టీ ఉంగుటూరు మండల మహిళా అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ ఆకస్మిక మరణం ఆమె కుటుంబానికే కాకుండా తెలుగుదేశం పార్టీకి తీరని లోటని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం షిరిడి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమ్యకృష్ణ కుటుంబ సభ్యులను శనివారం ఉదయం ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి లోని రమ్య స్వగృహంలో వెంకట్రావ్, జ్ఞానేశ్వరి దంపతులు పరామర్శించి ఓదార్చారు. రమ్యకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈసందర్భంగా వెంకట్రావ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రమ్యకృష్ణ ధైర్యంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధి కి కృషి చేశారని గుర్తు చేసారు. తనపై ఎన్నో పోలీస్ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసినా వాటికి ఎదురొడ్డి పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం అన్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేసిన వైసీపీ గుండాలు తిరిగి టీడీపీ నాయకులు కార్యకర్తలపైనే కేసులు పెట్టగా రెండు నెలలు అజ్ఞాతవాసం చేసారని గుర్తుచేశారు. వైసీపీ నాయకుల అవినీతి అక్రమాలపై ప్రశ్నించడంతో పాటు తెలుగుదేశం పార్టీ ని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు రమ్యకృష్ణ చేసిన కృషిని కొనియాడారు. పార్టీ అధికారంలోకి రావటం కోసం ఎంతగానో కృషిచేసిన రమ్యకృష్ణ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులలో మరణించడం బాధాకరమన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో తన గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన రమ్య ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. నిజాయితీ నిబద్దతతో పనిచేసే ఆమె లేకపోవటం, గన్నవరంలో ప్రశ్నించే గొంతు మూగబోయింది అని, ఆమె కుటుంబానికి తెలుగుదేశం పార్టీతోపాటు తాను అండగా ఉంటానని వెంకట్రావ్ ఈసందర్భంగా హామీ ఇచ్చారు.