గన్నవరం అభివృద్దె ఎజెండా : ఎమ్మెల్యే వెంకట్రావ్
* కక్ష సాధింపు రాజకీయాలు చేయను
* తప్పు చేసిన వారిని వదిలి పెట్టే ప్రశ్న లేదు
* సూపర్ సిక్స్ పథకాల అమలుకు కృషి
హనుమాన్ జంక్షన్ : వి బి న్యూస్ డిజిటల్ మీడియా
గడచిన పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని గన్నవరం నియోజకవర్గ అభివృద్దె ధ్యేయంగా ముందుకు సాగుతానని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం రామవరప్పాడు రింగ్ నుండి హనుమాన్ జంక్షన్ వరకు సాగిన విజయోత్సవ యాత్ర రాత్రి 12 గంటలకు హనుమాన్ జంక్షన్ లో ముగిసింది.
ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యార్లగడ్డ వెంకట్రావు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గన్నవరం నియోజకవర్గం లోని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని వెంకట్రావు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించానని తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో పూర్తిస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో నాలుగు దఫాలు మాట్లాడటంతో పాటు రాష్ట్ర మంత్రిని పారిశ్రామికవాడ కు తీసుకొచ్చిన సంగతి గుర్తు చేశారు. విమానాశ్రయం ఎదురుగా వున్న ప్రభుత్వభూమిలో ఐటి సంస్థలు ఏర్పాటు చేసి తీరుతానని చెప్పారు. మల్లవల్లి పారిశ్రామివాడ లో అశోక్ లేలాండ్ పూర్తిస్థాయిలో నడిపేందుకు వీలుగా ఇప్పటికే అశోక్ లేలాండ్ ప్రతినిధులతో మాట్లాడటం జరిగిందని మరికొద్ది రోజుల్లో అశోక్ లేలాండ్లో పనుల ప్రారంభమవుతాయని తెలిపారు. నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి చేసి 20వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని స్పష్టం చేశారు. సాగునీటి కోసం రైతులు ఎవరి దయదక్షిణ్యాల పై ఆధారపడాల్సిన అవసరం లేదని పోలవరం కాలువ పై పూర్తిస్థాయిలో మోటార్లు ఏర్పాటు చేస్తానన్న హామీ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించానని ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే తన సొంత నిధుల నుంచి మోటార్లు ఏర్పాటు చేసి రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చారు.
ఏలూరు కాలువపై ప్రసాదంపాడు,కేసరపల్లి గ్రామాల్లో వంతెనల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడనని, అలా అని తప్పు చేసిన అధికారులను ప్రజాప్రతినిధులను వదిలేసే ప్రతి లేదని వెంకట్రావు హెచ్చరించారు. ఎందరో మహానుభావులు ఎమ్మెల్యేలు గా పనిచేసిన గన్నవరం నియోజకవర్గం గత పదేళ్లుగా అక్రమాలకు, అవినీతికి అడ్డాగా మారిందని, గన్నవరం అంటే గ్రావెల్ మట్టి మాఫియాలకు మారుపేరుగా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం అంటే మట్టి మాఫియా కాదని ఐటి, పరిశ్రమలకు చిరునామాగా మారుస్తాననిపేర్కొన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన నియోజకవర్గల్లో ఓట్ల పరంగా చూస్తే గన్నవరం రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో ఉందని భారీ మెజార్టీ గెలిపించిన గన్నవరం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చలమలశెట్టి రమేష్ బాబు, కొల్లా ఆనంద్, ఆళ్ళ గోపాలకృష్ణ, వేములపల్లి శ్రీనివాసరావు, గుండపనేని ఉమా ప్రసాద్, మూల్పూరి సాయి కళ్యాణి, వడ్డీ నాగేశ్వరరావు, సుంకర బోస్, వేగిరెడ్డి పాపారావు, దుట్టా శ్రీమన్నారాయణ, చిన్నాల చిన్నా తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…..