బాపులపాడు మండల డీలర్స్ అసోసియేషన్ లో నెలమామూళ్లు కోసం చీలికలు తీసుకొస్తున్న పిడిఎస్ డిటి ప్రధాన్
వాదిస్తున్న డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసిన డిటి ప్రధాన్
హనుమాన్ జంక్షన్, సెప్టెంబర్ 18, వి బి న్యూస్ డిజిటల్ మీడియా
బాపులపాడు మండల డీలర్ల పై పిడిఎస్ డిటి ప్రధాన్ చేస్తున్న వ్యాఖ్యలను, దాడులను ఖండిస్తున్నామని బాపులపాడు మండల అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం బాపులపాడు తహశీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్నేపల్లి శేఖర్ మరియు కమిటీ మెంబర్లు మాట్లాడుతూ పిడిఎస్ డిటిగా ప్రధాన్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి డీలర్ల అసోసియేషన్ లో చీలికలు మొదలయ్యాయని దానికి కారణం మొదటి నుండి నెలమామూళ్లు ఇవ్వాలని డీలర్ల పై ఒత్తిడి తీసుకొచ్చేవాడని దీనిపై మండల అధ్యక్షుడు తిరస్కరించలేక కాలయాపన చేస్తూ ఉండటంతో డీలర్లు అందరినీ విభజించు పాలించు అనే విధంగా మాపై ఒత్తిడి తీసుకువస్తూ మాలో మాకే గొడవలు అయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నాడని వాపోయారు. అందులో భాగంగానే అమాయకమైన ఇద్దరు మహిళా డీలర్ల పై కక్షపూరితంగా 6ఏ కేసులు నమోదు చేశాడు. దీనిపై ప్రశ్నించిన కమిటీ మెంబర్లకు నాది ఏమీ లేదని గత ప్రభుత్వం లోని వైసీపీ నాయకులు కేసు నమోదు చేసే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారని నాయకులపై నెపం నెట్టేసి దాట వేశాడు. ప్రస్తుతం ప్రభుత్వం మారినా కూడా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇది ఏంటని అడిగితే ప్రస్తుతం ఉన్న జనసేన నాయకులు పేర్లు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం పీడీఏస్ డిటి ప్రధాన్ డీలర్ల అధ్యక్షుడు శేఖర్ కి ఫోన్ చేసి తహసిల్దార్ కార్యాలయానికి రావాలని పిలవటంతో అక్కడికి వచ్చిన శేఖర్ ను అసోసియేషన్ పేరు చెప్పి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దగ్గర మీరు మీ డీలర్లు నాపై కంప్లైంట్ ఇచ్చారని నాకు తెలిసిందని ఈ విషయంలో మిమ్మల్ని ఎవరిని వదిలేది లేదని అందరి అంతూ చూస్తాను అంటూ, అసలు నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వే ఎవడ్రా అంటూ భయభ్రాంతులకు గురి చేశారని బాధతో ఆవేదన వెళ్లగక్కుతూ ఇన్నాళ్ళు ఉపేక్షించిన, ప్రభుత్వాలు మారినా, నాయకులు మరీనా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని, కాబట్టి దీనికి నాయకులు, అధికారుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. ఈ విషయంపై కృష్ణాజిల్లా మరియు రాష్ట్ర సంఘాలు కూడా మాకు మద్దతు తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అసోసియేషన్ కార్యదర్శి కగ్గ గాంధీ, కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు ధారావతు హరికృష్ణ, కమిటీ మెంబర్లు ఆకునూరి మాణిక్యాలరావు, మాతంగి కిషోర్, నల్ల పార్వతి తదితరులు పాల్గొన్నారు.